“హ్యాపీ వెడ్డింగ్” అంటూ ప్రీ వెడ్డింగ్ కు సిద్దమవుతున్న నిహారిక, సుమంత్ అశ్విన్

Happy wedding's Pre Wedding - Niharika and Sumanth Aswin

హ్యాపీ వెడ్డింగ్ కోసం ప్రీ వెడ్డింగ్ అంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సిద్ధమవుతున్నారు మెగా తనయ నిహారిక మరియు సుమంత్ అశ్విన్. “పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే విషయమే, అయితే పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే రోజు వరకూ రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. ప్రతీ ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రతీ ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందించాం” అని హ్యాపీ వెడ్డింగ్ నిర్మాత సినిమా గురించి మాట్లాడారు. పెళ్లి నేపధ్యంలో ఉండబోయే సినిమా అని ట్రైలర్ లో మనకు అనిపిస్తూ ఉన్నా, నిర్మాత మాటలతో ఇప్పుడు అది ఖరారైంది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. మెగా హీరోయిన్ నిహారిక సినిమా కావడంతో మెగా ఫాన్స్ అందరూ ఈ సినిమా మీద ఆసక్తిగా ఉన్నారు.

ట్రైలర్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉండడం, అందులో ఉన్న సంభాషణలు కొత్తగా ఉండడంతో  సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. పెళ్ళికి ముందు, పెళ్లి తరువాత కొత్త కుటుంబానికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఆలోచించే విధానం గురించి చూపిస్తూనే, వచ్చే అమ్మాయి తన కుటుంబంతో ఎలా ఉంటుందో అనే ఒక అబ్బాయి ఆలోచనా తీరుని కూడా ప్రదర్శించే ప్రయత్నం దర్శకుడు లక్ష్మణ్ కార్య చేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు కొత్త కథలతో సత్తా చాటుతున్నారు. కొత్త దర్శకుడు అయిన లక్ష్మణ్ కార్య కూడా ఇదే విధంగా హిట్ కొడతాడేమో చూడాలి.

పాకెట్ సినిమాతో సంయుక్తంగా ప్రతిష్టాత్మకమయిన యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సినిమా కావడం చేత  కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో యూవీ క్రియేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ మెజారిటీగా హిట్ అయినవే కాగా వారి కథల ఎంపిక బావుంటుందనేది పలువురి భావన. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి ఊపు మీదున్న ఎస్.ఎస్.థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్, ఫిదా సినిమాతో ఫిదా చేసిన శక్తి కాంత్ పాటలు ఈ సినిమాకి కలిసొచ్చే విషయాలే. అయితే జూలై 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ‘ప్రీ వెడ్డింగ్’ పేరుతో ఘనంగా నిర్వహించనున్నారు, అలాగే సినిమాను కూడా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

-గణేష్ గుల్లిపల్లి