టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రి అయ్యాడు. గత గురవార హార్దిక్ భార్య నటాషా స్టాన్కోవిచ్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే తన కొడుకు ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భార్య నటాషాతో పాటు ఉన్న ఫోటోను షేర్ చేశాడు హార్దిక్. గులాబీ బోకేను బెడ్‌పై ఉంచి భార్యను ఆలింగనం చేసుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో భార్యను పొగడ్తలతో ముంచెత్తుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘ నా గులాబీకి గులాబీలు.. నేను ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చిన నీకు(నటాషా) ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించాడు.
తాను తండ్రి అయిన విషయాన్ని హార్దిక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మేము కుమారుడితో ఆశీర్వదించబడ్డాము’ అని హార్దిక్ తండ్రి అయిన విషయాన్ని వెల్లడించాడు. ఆపై శనివారం కుమారుడి ఫోటోను కూడా హార్దిక్ పోస్ట్ చేశాడు. తన కొడుకును చూసుకుని మురిసిపోతూ ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. హార్దిక్, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని తెలియజేశారు.