టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్లు పరోక్ష హెచ్చరికలు పంపారు. త్వరలో నిర్వహించనున్న ఫిట్‌నెస్ క్యాంప్‌కు పదిరోజుల పాటు ఎన్‌సీఏకు అందుబాటులో ఉండాలంటూ తెలిపింది. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకున్న పాండ్యా ఇటీవలే ఎన్‌సీఏకు వెళ్లనని ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే సెలెక్టర్ల హెచ్చరికతో పాండ్యా ఎన్‌సీఏకు వెళ్లనున్నట్లు సమాచారం. మార్చి 26 నుంచి ఐపీఎల్ మొదలుకానున్న నేపథ్యంలో పాండ్యా మరో రెండు రోజుల్లో ఎన్‌సీఏలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్ మెగావేలానికి ముందు హార్దిక్‌ను రూ. 15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. ఆ జట్టుకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
ఈ విషయం పక్కనబెడితే.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీ కానున్నారు. మరోవైపు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం టీమిండియా తర్వాత ఆడబోయే మ్యాచ్‌లపై దృష్టి పెట్టనున్నాడు. అందులో టి20 ప్రపంచకప్ 2022 కూడా ఉంది. దీనికి ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించాలని.. జట్టు కాంబినేషన్ ఎలా ఉండాలి.. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదా అనేది చూసుకోనున్నారు. ఈ విషయాలపై ద్రవిడ్, రోహిత్‌లు ఇప్పటికే చర్చించారని.. ఎవరు టి20 ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉండాలనేది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఐపీఎల్ ప్రారంభానికి ముందే పదిరోజులు ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంప్‌కు మొత్తం 25 క్రికెటర్లు హాజరు కానున్నారు. ఎన్‌సీఏ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫిట్‌నెస్ క్యాంప్ జరగనుంది.
కాగా గాయాలతో లంకతో సిరీస్‌కు దూరమైన కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్‌లు ఇప్పటికే ఎన్‌సీఏలో ఉన్నారు. వారంతా తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే పనిలో ఉన్నారు. గతేడాది టి20 వరల్డ్‌కప్ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడని హార్దిక్ పాండ్యాపై రోహిత్ నమ్మకముంచాడు. అతన్ని మరో ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తూ వచ్చే ప్రపంచకప్‌లో అతనికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు.కాగా దీనిపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ.. ”హార్దిక్ పాండ్యా క్యాంప్‌లో జాయిన్ కానున్నాడు. ముందు అనుకున్న ప్రకారం హార్దిక్ పాండ్యా లిస్టులో లేడు. కానీ రోహిత్, ద్రవిడ్ సూచనల మేరకు హార్దిక్ పేరును ఖరారు చేశాం” అంటూ చెప్పుకొచ్చారు.