టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కొడుక్కి ‘అగస్త్య’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన ముద్దుల కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్ కారును బహుహతిగా పంపిన ఆ కార్ డిలర్ షిప్ కంపెనీకి కూడా ఇన్స్టాగ్రామ్ పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. కాగా చాలా రోజుల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ ఐపీఎల్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియన్ నటి నటాషాతో హార్థిక్ పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కాక ముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత గత నెలలో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను పాండ్య తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోటు నెట్టింటా వైరలవుతున్నాయి. అంతేగాక పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయిన ఈ జంట సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు.