గుజరాత్ పటేల్ కి జైలు యోగం !

గుజరాత్ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. 2015 నాటి అల్లర్ల కేసులో హార్దిక్ పటేల్‌ను గుజరాత్ న్యాయస్థానం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. విస్‌నగర్‌‌లోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసులో హార్దిక్‌తోపాటు ఆయన అనుచరులు లాల్జి పటేల్, ఏకే పటేల్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్ చేస్తూ 2015లో హార్దిక్ పటేల్ నాయకత్వంలో గుజరాత్‌లో ఆందోళనలు జరిగాయి. సుమారు 5 వేల మంది ప్రజలు గుంపుగా వెల్లి బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్ పటేల్ ఆఫీస్‌ను ధ్వంసం చేశారు.

ఈ ఘటనలో హార్దిక్ పటేల్ సహా 17 మంది కేసులు నమోదయ్యాయి. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగతా 14 మంది నిందితుల్ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ప్రశాంతంగా ఉండాలని తీర్పు వెలువడటానికి ముందు హార్దిక్ తన అనుచరులను కోరాడని సమాచారం. జైలు శిక్ష పడిన వెంటనే హార్దిక్, అతడి అనుచరులకు రూ.15 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విస్‌నగర్‌‌ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగష్టు 27లోగా హైకోర్టును ఆశ్రయించే వీలుందని న్యాయస్థానం తెలిపింది. నెలరోజుల్లోగా హైకోర్టులో అపీల్ చేయలేకపోయినా, బెయిల్ పొందకపోయినా హార్దిక్ విసానగర్ కోర్టులో సరెండర్ కావాల్సి ఉంటుంది.