పోలవరం ఆంధ్రుల జీవనాడిగా భావిస్తున్న ప్రభుత్వం దాని ద్వారా ఇప్పటికే గోదావరి – కృష్ణ నదులను తాత్కాలిక పట్టిసీమ పంపుహౌస్‌తో అనుసంధానం చేసింది. ఆ పట్టిసీమ వల్ల ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకి నీరు అందడంతో ఆ రైతులు ఎంతోసంతోషంగా ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కుడికాలువ నీటిని పెన్నా నదికి తీసుకెళ్లి గోదావరి – పెన్నా నదుల అనుసంధానాన్ని కూడా పూర్తిచేసి రాష్ట్రంలో సాగునీటికి కొరత లేకుండా చేయాలనే దానికి చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడం పైన ఎక్కడో వర్షాలు బాగా కురిసి కాస్తో, కూస్తో వరద నీరు వచ్చినా ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులను దాటి ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి ద్వారా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఆ నీటిని తరలించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని భావించిన సీఎం చంద్రబాబు పట్టిసీమ లాంటి మరో బృహత్తరమైన పధకానికి నాంది పలికారు. నదుల అనుసంధానం వల్ల నేల్లోరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు లబ్ది పొందనున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో నిల్వ అవుతున్న నీటి వద్ద సముద్రమట్టం చూస్తే 15 మీటర్లుగా ఉంది. మరోవైపు నకరికల్లు వద్ద సముద్ర నీటిమట్టం 140 మీటర్లుగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాల ద్వారా 125 మీటర్ల ఎత్తునకు నీటిని పంపింగ్ చేసేందుకు ఈ ప్రాజెక్టుని నిర్మించదానికి సిద్దమయ్యింది ఏపీ ప్రభుత్వం. ప్రాజెక్టు పూర్తి అయితే సాగర్ డ్యాం నుంచి కృష్ణానది నీటి విడుదల కోసం ఆయ కట్టు రైతులు ఎదురు చూడాల్సిన పని లేదు. డెల్టా రైతులతో పాటే జూన్, జూలై నెలల్లోనే మాగాణి పంటల సాగు చేపట్టొచ్చు.
తొలుత హరిశ్చంద్రాపురం వద్ద 7 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయగల ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లలో నీరు ప్రవహిస్తుంది. ఆ తర్వాత 56 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ ఛానెల్ నిర్మించి మొత్తం ఐదు దశల్లో ఆ నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం హరిశ్చంద్రాపురంతో పాటు లింగాపురం, గోరంట్ల, భృగుబండ, నకరికల్లు వద్ద పంపుహౌస్‌లు నిర్మిస్తారని తెలుస్తోంది. నాగార్జునసాగర్ కుడికాలువ 80వ కిలోమీటర్ వద్ద నకరికల్లులో గోదావరి – పెన్నా కాలువని అనుసంధానం చేస్తారు. అక్కడే డెలివరీ సిస్టమ్‌ని నిర్మిస్తారు. ఇలా ఏటా 73 టీఎంసీల గోదా వరి నీటిని నాగార్జునసాగర్ కుడికాలువకు తరలించడం ద్వారా 9.61 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీ కరిస్తారు. దీంతో సాగర్ ఆయకట్టులో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలు తొలగిపోతాయి.
మొత్తం ఐదు పంపుహౌస్‌లు, 10 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు, 56 కిలోమీటర్ల దూరం ఓపెన్ గ్రావిటీ ఛానెల్‌ని నిర్మించాల్సి ఉన్నందున సుమారు 3,600 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఇరిగేషన్ అధికారులు ఒక అంచనాకి వచ్చారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.650 కోట్లు కేటాయించినట్లు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భారీగా 3,600 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏపీ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల సామాజిక ప్రభావిత అంచనా సర్వే అవసరం ఉండదు. తద్వారా భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయొచ్చు.
పట్టిసీమ ప్రాజెక్టుని ఎలాగైతే రికార్డు సమయంలో ప్రభుత్వం పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు తీసుకొచ్చిందో అదే రీతిన హరిశ్చంద్రాపురం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారని అధికారులు చెపుతున్నారు. కొద్ది రోజుల్లోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభవుతుందని అంటున్నారు. 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిచేసి సాగర్ కుడికాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలనేది ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకందని తెలుస్తోంది. దీంతో యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పనులు ప్రారంభించారు. ఇది అందుబాటులోకి వస్తే సాగర్ ఆయకట్టు రైతులకు జూన్ నెలలోనే సాగునీరు వచిచ సకాలంలో ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగుచేసుకోవచ్చు. కొన్నాళ్లుగా సాగర్‌కు పూర్తిస్థాయిలో వరదనీరు రానందున సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు తీసుకువస్తే ఆయకట్టుదారులు కష్టాల నుంచి గట్టెక్కినట్టే.