పోలవరానికి గడ్కరీ… స్వల్ప ఉద్రిక్తత !

Central Minister Nitin Gadkari visits Polavaram

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన ఆసక్తిగా మారింది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగిన తరువాత తొలి సారి ఏపీలో పర్యటిస్తున్న గడ్కరి ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రాజెక్టుపై మంత్రి సందేహాలు లేవనెత్తితే అక్కడికక్కడే నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గడ్కరీ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన పోలవరం పనులను పరిశీలించనున్నారు. పోలవరం కాంట్రాక్ట్ ఏజెన్సీలతో పాటు అధికారులతో నితిన్‌ గడ్కరీ సమీక్ష నిర్వహిస్తారు. సుమారు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.

టీడీపీ బీజేపీ కలిసి ఉన్న సమయంలో ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఇప్పుడు విడిపోయాక సందర్శిస్తున్నారు. పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలతో మోడీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం టార్గెట్ చేస్తున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జల వనరుల శాఖ అధికారులతో క్షేత్రస్ధాయి పనులను పరిశీలించనున్న మంత్రి పలు అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్కరీతో పాటు పోలవరం వెళ్తున్న సీఎం చంద్రబాబు పనుల పురోగతిలో ఎటువంటి దాపరికం లేకుండా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

దీంతో పాటు పనుల పురోగతి, నిధుల కేటాయింపు, కేంద్రం మంజూరు చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులపై పూర్తి నివేదికను రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేశారు. రెండు రోజుల పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించిన మంత్రి దేవినేని ఉమ నివేదికను స్వయంగా పరిశీలించారు. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లాలని చూసిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తమను అనుమతించాలని వారు ఆందోళనకు దిగారు. పాస్‌లు ఉన్నవారినే పంపుతామని పోలీసులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.