టీఆర్ఎస్ సీనియర్ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. సంగారెడ్డిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ ను స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచాను పేల్చాయి. ఈ సందర్భంగా 2-3 తారా జువ్వలు పైకి పోకుండా కాన్వాయ్ వైపు దూసుకొచ్చాయి. ఓ రాకెట్ మంత్రి కారును తాకింది.
దీంతో నేతలు, కార్యకర్తలు తమ వాహనాలు వదిలిపెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పొగలో చిక్కుకున్నారు. అయితే గన్‌మెన్లు అప్రమత్తమై ఆయనను అక్కడనుంచి సురక్షితంగా తరలించారు. బాణాసంచా పేలుడులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్యకర్తలు కాల్చిన టపాసులు 3 నిమిషాల పాటు పేలాయి. అంతసేపు కారులోనే ఉండిపోయిన హరీశ్ ఆ తర్వాత కారు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.