టీటీడీ అధికారుల తీరుపై మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

టీటీడీ అధికారుల తీరుపై మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రోజు క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తిరుమలలో శ్రీవారి దర్శానికి రావటం.. సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు ఏపీ అధికారపార్టీకి చెందిన పలువురు ఆయనకు స్వాగతం పలకటం.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తిరుమలకు వచ్చారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడ తీవ్ర అవమానం ఎదురైనట్లు చెబుతున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన మంత్రి హరీశ్ కు టీటీడీ ప్రోటోకాల్ పాటించకపోవటం వివాదమైంది. టీటీడీ అధికారుల తీరుతో మంత్రి హరీశ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వామి దర్శనానికి వెళ్లేందుకు సైతం నిరాకరించారు. ఈ సమయంలో టీడీపీ బోర్డు సభ్యుడైన దామోదర్ నడిపిన దౌత్యంతో కోపాన్ని తగ్గించుకొని స్వామి వారి దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు.

విచిత్రమైన విషయం ఏమంటే.. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు.. కీలక అధికారులు.. సినీ రంగ ప్రముఖులు.. రాజకీయ నేతలు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే.. ఎవరికి లేని రీతిలో మంత్రి హరీశ్ కు మాత్రం అవమానం ఎదురుకావటం గమనార్హం.