రైతు ఆత్మహత్య పై హరీష్‌రావు స్పందన

రైతు ఆత్మహత్య పై హరీష్‌రావు స్పందన

సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ మండలం వేలూరులో నర్సింహులు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే అతని మృతికి ప్రభుత్వ అధికారుల వేధింపులే కారణమని ప్రతిపక్షాలు, మృతుని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. రైతు మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రైతు కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ఊరిలో ప్రభుత్వ భూమి ఉంటే అందులో నుంచి నర్సింహులు కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇస్తామని అన్నారు. వాళ్ల అమ్మాయి చదువుకు కూడా ప్రభుత్వం తరఫున సాకారం అందిస్తామని వెల్లడించారు.

ఈ ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నర్సింహులు ఆత్మహత్యకు సంబంధించి విమర్శలు చేసేవారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ హయాంలోనే అతని భూమి లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తే అది వారిపై పడిందన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు రాజకీయాలు చేయడం చాలా బాధకరమని పేర్కొన్నారు.

కాగా, నర్సింహులుకు ఉన్న 13 గుంటల భూమిని బలవంతంగా రైతు వేదిక నిర్మాణానికి తీసుకుంటున్నారనే ఆవేదనతో బుధవారం పురుగుల మందు తాగాడని అతని బంధువులు ఆరోపించారు. ఆ భూమిని రికార్డుల్లోకి కూడా ఎక్కించకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. సర్పంచ్‌, రెవెన్యూ అధికారుల ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.