పంజాబీ అమ్మాయి హర్మన్ ప్రీత్ కౌర్ పేరు ఇప్పుడు దేశంలో మార్మోగిపోతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో సమానంగా ఒక్క ఇన్నింగ్స్ తో పేరు తెచ్చుకుంది హర్మన్. కానీ ఆమె గత జీవితం అంతా సుఖాలమయం కాదు. కెరీర్లో ఎదగడానికి ఎన్నో కష్టాలు పడిన హర్మన్ ప్రీత్.. చివరకు ఉద్యోగం కోసం కూడా ఎన్నో అవమానాలు భరించింది. పోలీస్ శాఖలో ట్రై చేసి.. మొత్తం మీద రైల్వేలో సెటిలైంది.
హర్మన్ ప్రీత్ కౌర్.. ఇప్పుడు మహిళా క్రికెట్లో సంచలనం. ఫైనల్లో కూడా ఓ మంచి ఇన్నింగ్స్ ఆడితే.. ఆమెతో ఒప్పందాలు చేసుకునేందుకు చాలా బ్రాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే బిగ్ బాష్ లీగ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏకైక ఇండియన్ లేడీ క్రికెటర్ హర్మన్ ప్రీతే. ఆ లీగే ఆమె జీవితాన్ని మార్చేసింది. అప్పట్నుంచి మెరుపు షాట్లు నిలకడగా ఆడుతోంది.
ఇలాంటి హర్మన్ కెరీర్లో ఎదిగాక.. ఉద్యోగం కోసం పంజాబ్ పోలీస్ ను సంప్రదిస్తే అవమానించారట. హర్భజన్ కు డీఎస్పీ ఇచ్చినంత మాత్రాన నీకివ్వమని, నీకూ, హర్భజన్ కు నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వెక్కిరించిరట. చివరకు ఏదోలా కష్టపడి రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించింది హర్మన్. దీంతో ఇప్పుడు హర్మన్ ను అవమానించిన అధికారి ఎవరో తెలుసుకునే పనిలో పంజాబ్ పోలీస్ బిజీగా ఉన్నారు.