విడుదల తేదీ : జూన్ 14, 2024
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: సుధీర్ బాబు, మాల్వికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే
దర్శకుడు: జ్ఞాన సాగర్ ద్వారక
నిర్మాతలు : సుమంత్ జి. నాయుడు
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన పలు మూవీ ల్లో మన టాలీవుడ్ నుంచి వచ్చిన సాలిడ్ యాక్షన్ డ్రామా “హరోం హర” మూవీ కూడా ఒకటి. నైట్రో స్టార్ నుంచి నవ దళపతి సుధీర్ బాబుగా మారి చేసిన ఈ మూవీ ట్రైలర్ తోనే అందరిలో మంచి అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ మూవీ అంచనాలు అందుకుందో లేదో సమీక్ష లో చూద్దాం రండి.
కథ:
ఇక కథలోకి వస్తే ఈ మూవీ నేపథ్యం 1980 దశకం చిత్తూరు జిల్లా కుప్పంలో సెట్ చేయబడి ఉంటుంది. అలా కుప్పం ప్రాంతంలో అత్యంత క్రూరంగా ప్రజల్ని హింసిస్తూ, వారి భూములు లాక్కొని భయపెడుతూ తమ్మిరెడ్డి (లక్కి లక్ష్మణ్) తన తమ్ముడు, కొడుకు శరత్ రెడ్డి (అర్జున్ గౌడ) లతో తానే కింగ్ లా జీవిస్తారు . మరి ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చిన్నపాటి ఉద్యోగం కోసం ఒక కాలేజ్ లో లాబ్ అసిస్టెంట్ గా సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తారు . తన తండ్రి (జయ ప్రకాష్) చేసిన అప్పులు తీర్చడానికి తన టాలెంట్ తో తుపాకుల మాఫియాలోకి సుబ్రహ్మణ్యం అడుగుపెడతారు . ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తండ్రికి తమ్మిరెడ్డి వల్ల ఆపద అనేది ఎలా వస్తుంది? తన ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేస్తారు ? గన్ మాఫియా వల్ల సుబ్రహ్మణ్యంకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేవి తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఖచ్చితంగా ఒక నటుడుగా సుధీర్ బాబుని ప్రతి మూవీ కు మెచ్చుకొని తీరాలి. తన కథా ఎంపిక నుంచి తన పాత్రలకి తాను ఇస్తున్న పెర్ఫామెన్స్ లు మాత్రం చాలా బాగున్నాయని చెప్పాలి. అలా ఈ మూవీ లో తన నుంచి 100 శాతానికి మించి సుధీర్ బాబు అందించారు . తన లుక్స్ అయితేనేం, మాట, నడవడిక అన్నిట్లో కూడా తాను అదరగొట్టేసారు . అలాగే తనపై పలు ఎమోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ చాలా చాలా బాగున్నాయి.
ఇక ఈ మూవీ లో సుధీర్ తో ఆద్యంతం కనిపించిన నటుడు సునీల్ ఫలని స్వామిగా మంచి నటన కనబరిచారు. ఇంకా మాళవిక మోహనన్ పాత్ర కూడా చాలా బాగుంది. ఇంకా విలన్ పాత్రల్లో కనిపించిన నటుడు కేజీయఫ్ ఫేమ్ లక్కి లక్ష్మణ్ సాలిడ్ విలనిజాన్ని చూపించారు అని చెప్పాలి. అలాగే కన్నడ నటుడు అర్జున్ గౌడ మంచి డెబ్యూ ఈ మూవీ తో టాలీవుడ్ లో అందించాడు.
ఇక ఈ మూవీ లో హైలైట్ అంశాల్లో హీరో ఎలివేషన్స్ కానీ, మెయిన్ గా మూవీ టోన్ యూనిక్ గా సాగుతున్నట్టుగా ఫస్టాఫ్ లో అనిపిస్తుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ ని మంచి రిఫ్రెషింగ్ గా చూసేందుకు ఇంపుగా ఉన్నాయి . అలాగే మాస్ అండ్ మంచి వైలెన్స్ యాక్షన్ ను ఇష్టపడేవాళ్ళకి కూడా పుష్కలంగా సాలిడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక వీటితో పాటుగా సుధీర్, జయప్రకాష్ నడుమ ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇతర నటీనటులు కాదంబరి కిరణ్, అక్షర గౌడ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.
మైనస్ పాయింట్స్:
ఈ మూవీ లో మేజర్ డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అది మూవీ లైన్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో హీరోని బాగా ఎలివేట్ చేసేందుకు వస్తున్న తరహా లైన్ లోనే హరోం హర కూడా కనిపిస్తూ ఉంది . యశ్ కి కేజీయఫ్, అల్లు అర్జున్ కు పుష్ప ఎలానో ఇది సుధీర్ బాబు వెర్షన్ అని చెప్పాలి. అయితే మూవీ లో ఎంచుకున్న ప్రాంత నేపథ్యం భాషా యాస కూడా అలానే ఉండడంతో పుష్ప షేడ్స్ మరింత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కథని చెప్తూ తీసుకెళ్లే విధానం యాస కూడా ఆ మూవీ నే మరిపిస్తుంది.
ఇక వీటితో పాటుగా సెకండాఫ్ కూడా కొంచెం అక్కడక్కడ స్లో అయినట్లు అనిపిస్తుంది. అలాగే అన్ని యాక్షన్ సీక్వెన్స్ లతో పోలిస్తే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా అసహజం గా ఉంది . ఇది ఇంకాస్త బెటర్ గా చేయాల్సి ఉన్నది . అలాగే కొన్ని సీన్స్ లో లాజిక్స్ లేవు మరికొన్ని సీన్స్ అయితే ఇది వరకే చాలా మూవీ ల్లో చూసినట్టే అనిపిస్తాయి. మెయిన్ గా ఒక్క హీరో పాత్రని మాత్రమే ఎలివేట్ చేస్తూ సాగే మూవీ లు చాలా గుర్తు రావచ్చు. ఇక వీటితో పాటుగా మాళవిక పాత్రకి మూవీ లో మరీ అంత స్కోప్ లేదు.
సాంకేతిక వర్గం:
మూవీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మూవీ సెటప్ కి తగ్గట్టుగా వింటేజ్ బ్యాక్ డ్రాప్ అంతా నీట్ గా ఉన్నది . ఇక సాంకేతిక వర్గంలో మొదటగా చైతన్ భరద్వాజ్ చాలా మంచి సంగీతం అందించాడు . మెయిన్ గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఇంకా అరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బానే ఉన్నది కాని కొన్ని సీన్స్ ని వేగవంతం చేయాల్సింది.
ఇక దర్శకుడు జ్ఞ్యానసాగర్ ద్వారక విషయానికి వస్తే.. తను దర్శకునిగా ఈ మూవీ తో మెప్పించాడు కానీ చాలా రొటీన్ కథనే తీసుకున్నాడు. డైలాగ్స్ ని బాగా రాసుకున్నారు అలాగే స్క్రీన్ ప్లే ని కూడా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు కానీ ఒక్క కథ విషయంలో పాన్ ఇండియా హిట్స్ పుష్ప, కేజీయఫ్ లని చూసినవాళ్ళకి మాత్రం కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ తన వెర్షన్ వరకు హరోం హర ని కూడా ఎక్కడా తగ్గించే విధంగా తెరకెక్కించలేదు. పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఎంత కావాలో ఏ నటీనటులు నుంచి ఎంత రాబట్టాలో బాగానే చూసుకున్నారు . ఒక్క మూవీ లైన్ విషయం తప్ప తన సైడ్ నుంచి లోపాలు అంత ఎక్కువ లేవు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హరోం హర” సుధీర్ బాబు నుంచి మరో సాలిడ్ అటెంప్ట్ అని చెప్పుకోవాలి . నటుడుగా కూడా ఈ మూవీ తనకి ప్లస్ గా మారింది అని చెప్పవచ్చు. మంచి క్లీన్ ఎలివేషన్స్, సాలిడ్ మ్యూజిక్ టేస్ట్ ఉన్నవాళ్ళని ఈ మూవీ ఎంగేజ్ చేస్తుంది. దర్శకుడు కూడా మూవీ ని బాగానే మలిచాడు కానీ లైన్ ఒకింత రొటీన్ గా అనిపిస్తుంది. ఆల్రెడీ తెలిసిన లైన్ అయినా పర్వాలేదు అంటే ఈ మూవీ మాస్ ఆడియెన్స్ ను బాగానే మెప్పిస్తుంది.