Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పైకి కనిపించేటంత మంచివాడు కాదా….?
ఆటసంగతి పక్కనపెడితే వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడు… భార్యాబిడ్డలను ఎలా చూసుకుంటాడు. ఇతర అమ్మాయిలతో ఎలా ఉంటాడు? అతని కుటుంబ జీవితం ఎలా సాగుతోంది? ఈ ప్రశ్నలకు కారణం భార్య హాసిన్ జహాన్ షమీపై చేసిన ఆరోపణలే. నాలుగేళ్ల క్రితం షమీని ప్రేమించి పెళ్లిచేసుకున్న హాసిన్ జహాన్ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. టీమిండియాలో సభ్యుడిగా పైకి ఎంతో సంస్కారవంతగా కనిపించే షమీ అసలు స్వరూపం బట్టబయలుచేసింది. షమీకి ఎంతో మంది అమ్మాయిలతో వివాహేతరసంబంధాలున్నాయని హాసిన్ ఆరోపించింది. ఆ విషయం తెలుసుకోవడంతో తనను షమీ, అతని కుటుంబసభ్యులు వేధించడం మొదలుపెట్టారని ఆమె తెలిపింది. గత రెండేళ్లగా వారంతా తనను వేధింపులకు గురిచేస్తున్నారని, తనను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో చాలామంది అమ్మాయిలతో షమికి అక్రమసంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.
2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంఛైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్ ను షమీ తన కారులో దాచిపెట్టాడని, ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న వ్యవహారం తెలిసిందని హసీన్ చెప్పింది. షమీ ఫోన్ లో ఉన్న అసభ్యకర సంభాషణలు చదవడానికి ఒక రాత్రి సరిపోలేదని, మొబైల్ లో చాలామంది అమ్మాయిల ఫొటోలు కనిపించాయని తెలిపింది. వాట్సప్, ఫేస్ బుక్ లలో పలువురు మహిళలతో షమీ చేసిన ఛాటింగ్ స్క్రీన్ షాట్లను, పలువురు యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయితో షమికి పెళ్లయిందని, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం షమీ ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్ కూడా వెళ్లాడని చెప్పింది. గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్ కు తనను తీసుకెళ్లమని షమీని కోరగా… అతను వద్దన్నాడని.అంతటితో ఊరుకోకుండా అక్కడినుంచి ఫోన్ చేసి మరీ తనను తిట్టాడని ఆవేదన వ్యక్తంచేసింది. బీసీసీఐ పైనా హసిన్ సంచలన ఆరోపణలు చేసింది.
టీమిండియా ఎక్కడకు వెళ్లినా..కుల్ దీప్ అనే వ్యక్తి షమికి అమ్మాయిలను సప్లయ్ చేస్తాడని, బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. షమీ కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ తనను వేధిస్తున్నారని, అతని తల్లి, సోదరుడు తనపై దుర్భాషలాడారని, తెల్లవారుజామున రెండుగంటల నుంచి టార్చర్ మొదలుపెట్టారని, తనను చంపడానికి కూడా ప్రయత్నించారని హసీన్ తెలిపింది. తన కుటుంబం, పాప కోసం ఇన్నిరోజులు ఎదురుచూశానని, కానీ షమీలో మార్పురాలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. ఈ దారుణాలన్నీ తాను భరించగలిగానని, కానీ ఇతర మహిళలతో అతనికి సంబంధాలు ఉన్నాయనే విషయం తెలియగానే మనసు విరిగిపోయిందని, ఇకపై తాను ఏమాత్రం క్షమించలేనని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాల సాయంతో షమీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హాసిన్ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
భార్య ఆరోపణలపై షమీ ట్విట్టర్ లో స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం గురించి ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని, వాటిల్లో ఏ మాత్రం నిజంలేదని అతను ట్వీట్ చేశాడు. తనపై జరుగుతున్న కుట్ర ఇదని, తన క్రికెట్ జీవితాన్ని నాశనం చేసేందుకే ఎవరో ఇదంతా చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. షమీ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే హాసిన్ పోస్ట్ చేసిన ఫేస్ బుక్ ఎకౌంట్ డీయాక్టివేట్ కావడం చర్చనీయాంశంగా మారింది.