బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.5 సెంటీ మీటర్ల వర్షపాతంనమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
చెరువులు, కుంటలుజలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో పోచమ్మ చెరువు, సుందరగిరిలోని కోమటికుంట మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు.
బోర్నపల్లిలో 11.2 సెంటీమీటర్లు, రేణికుంటలో 10.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట 10.3 సెంటి మీటర్లు, కొహెడ మండలంలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై నుంచి వరద పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షం, వరదలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.