పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇటు శ్రీలంక తీరానికి దగ్గరలోని నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర ఆంధ్రా తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గురువారం రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. వర్షాలు కురుస్తాయనే అంచనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. మరోవైపు బుధవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.