రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయన్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గిందని, పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో వీటి పురోగతి నెమ్మదిగా ఉందని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణ, ఢిల్లీల్లో రుతుపవనాల ప్రవేశానికి అంత అనుకూలంగా లేదని చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్లో దిగువ స్థాయిలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా.. మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నెమ్మదిగా ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు.