ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. రాజస్థాన్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, కుండ పోత వర్షం కారణంగా.. సవాయిమాధోపూర్ జిల్లాలో రెండు వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ విషాదం సోమవారం రాత్రి చోటుచేసుకుంది.సవాయి మాధోపూర్ జిల్లాకు చెందిన పప్పూలాల్ తన పిల్లలు, బంధువులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు.
ఈ క్రమంలో వర్షం ప్రారంభమైంది. దీంతో ఇంటికి తిరుగుప్రయాణమయ్యేటప్పుడు నీటి ప్రవాహం పెరిగింది. కారు అదుపుతప్పి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మాన్‌సింగ్ (13), రౌనక్ (9) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. వారికోసం ఎంత వెతికిన లాభం లేకుండా పోయింది. అయితే, పప్పూలాల్, అతని బంధువులను విపత్తు నిర్వహణ అధికారులు రక్షించారు. ఆ తర్వాత వారు కొంత దూరంలో పొదల్లో మైనర్ బాలలు చిక్కుకుని విగత జీవులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అదే విధంగా, మరోఘటనలో.. జైరా నుంచి టాంక్‌కు గీతాదేవి (42) అనే మహిళ మృత దేహన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌లో గీతాదేవి కొడుకు అంకిత్ (12), ఆమె భర్త రామ్‌జీలాల్ (45) ప్రయాణిస్తున్నారు. నీటి ఉధృతి కారణంగా అంబులెన్స్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిలో ఆమె కుమారుడు అంకిత్ మరణించగా, ఆమె భర్త గల్లంతయ్యారు. కాగా, అంబులెన్స్ డ్రైవర్, ఆమె బంధులువులు అద్దాలు పగులకొట్టి ప్రాణాలతో బయటపడ్డారని బరౌని పోలీస్ అధికారి దాతర్ సింగ్ పేర్కొన్నారు.