బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.