చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు మంచెత్తాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత 1000 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. హెనాన్ ప్రావిన్స్‌లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో వీధులతో బాటు సబ్వే టన్నేల్లోకి నీరు చేరింది.అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది.
అధిక వర్షాల కారణంగా సెంట్రల్ చైనీస్ సిటీ జెంగ్ జూ లోని సబ్ వేలో వెళ్తున్న ఓ రైలు బోగీలో నడుములోతు నీరు చేరిండంతో 12 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. అనేకమంది రైల్లో చిక్కుకుపోయారు. రైల్లో కూడా ఇంతటి వరదనీరు చేరడం ఎన్నడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బ తిన్నాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై ఉండాల్సిన కారులు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. మరో కొన్నిరోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.