కన్నీళ్లు పెడుతున్న వీధులు

కన్నీళ్లు పెడుతున్న వీధులు

కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే సమాధానం అవుతున్నాయి. తమిళనాడు హెలికాప్టర్‌ ప్రమాదంలో సీఎస్‌డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్‌ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్‌ చేయించారు. లాన్స్‌నాయక్‌ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు.

సాయితేజ 8వ తరగతిలోనే సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. గొర్రెల పెంపకం జీవనవృత్తి కలిగిన తమ కుటుంబాల్లో చదువు ప్రాముఖ్యతను వివరించేవాడని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో చేరితే దేశ సేవ చేయవచ్చంటూ గ్రామస్తులను ప్రోత్సహించేవాడని చెబుతున్నారు. అతని తమ్ముడు సైన్యంలో చేరేందుకు ప్రేరణగా నిలిచాడని, మరెందరో సైన్యంలో చేరడానికి కారకుడయ్యాడని కీర్తించారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా తమతోపాటుగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ సరదాగా గడిపేవారన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేస్తే ఆ తృప్తే వేరంటూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు.