తమిళ స్టార్ హీరో అజిత్‌కుమార్ స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలా అంటూ అభిమానులు ఆయన్ను ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోగా అజిత్‌కు పేరుంది. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
ఇటివలి కాలంలో ఈ వార్తలు మరింత ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన అజిత్.. ప్రత్యేకంగా కానీ, పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఆయన పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర ట్విట్టర్ ద్వారా వివరించారు. అజిత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తప్పుడు వార్తలను ప్రసారం చేయొద్దని కోరారు.