2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్‌లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్‌స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి బ్రాత్‌వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్‌వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్‌వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్‌వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు.
ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్‌వైట్ వివరించాడు.తాజాగా ఈడెన్‌పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు ‘ఈడెన్’ వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్‌వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్‌వైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. ” గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్‌వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్‌వైట్‌కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు.
ఇక కార్లోస్ బ్రాత్‌వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ”తాజ్” అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్‌మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్‌ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్‌మహల్ వేదికగానే లవ్‌ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ”ఇండీ” అని పేరు పెట్టాడు.