‘‘ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాను. బ్యాచిలర్‌గా నా చివరి చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి, జీవితంలో మరోస్థాయికి వెళితే బాగుంటుందని ఆశపడుతున్నాను. ‘రాజా విక్రమార్క’ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు కార్తికేయ. దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’.
ఈ చిత్రంలో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరో హీరోయిన్లు. శ్రీ చిత్రమూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమా టైటిల్‌ను పెట్టుకునే అదృష్టం ఈ చిత్రం ద్వారా కలిగింది.
ఈ సినిమాను మేమే నిర్మించాలనుకున్నాం. ఫైనల్‌గా రామారెడ్డి, ఆదిరెడ్డిగారు నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో ‘రాజా విక్రమార్క’ ఉండాలి’’ అన్నారు సాయికుమార్. ‘‘ఈ సినిమాకు మూలస్తంభం కార్తికేయ’’ అన్నారు ‘88’ రామారెడ్డి. ‘మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు శ్రీ సరిపల్లి.