సినీ ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ – సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అయిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సినీ కష్టాలు అన్నీ అనుభవించి స్వయంకృషితో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. తర్వాత విలన్ గా సినిమాలు చేసిన రవితేజ ‘సింధూరం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాతో హీరోగా మారిన రవితేజ ‘ఇడియట్’ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారి పోయాడు.
ఈ సినిమా తర్వాత వరుస విజయాలు సాధించడం తో హీరో గా నిలదొక్కుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందిస్తూ నిర్మాతల హీరో అనిపించుకున్నాడు రవితేజ. అయితే రవితేజ గత కొంత కాలం గా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టికెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘డిస్కో రాజా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఎలాగైనా రేస్ లో నిలబడాలని రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ అనే మూవీలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా లేటెస్ట్ సమాచారం మేరకు మాస్ మహారాజా రవితేజ సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయట. ఈ క్రమంలో ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడట రవితేజ. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టిన రవితేజ దానిపై ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ నిర్మాణంలో భాగస్వాములవుతూ నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనే తరహాలో ఆలోచిస్తున్నారు. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – మంచు మనోజ్ – మంచు విష్ణు – నాని – రానా వంటి హీరోలు సినిమాల ప్రొడక్షన్స్ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో రవితేజ కూడా చేరే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.