Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై హీరో శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి గుంటూరులో నిర్వహించిన సదస్సులో శివాజీ పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ నరసింహన్ రాజకీయాలు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, పోరాడకుండా హోదాను సాధించలేమని అన్నారు. అయితే ప్రజలకంటే ముందు ఎంపీలు పోరాడాలని, పార్లమెంట్ ఉభయసభలు జరగకుండా చేస్తే..సగం విజయం సాధించినట్టేనని, ఎంపీలు నాటకాలాడుతున్నారని శివాజీ మండిపడ్డారు. బీజేపీతో కలిసి వైసీపీ, టీడీపీ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడునీ… శివాజీ తీవ్రంగా విమర్శించారు. కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారని, ఏపీకి సంబంధించిన విషయాలు ప్రస్తావిస్తే ఆయనకు కోపం వస్తోందని శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోతే లాభం లేదని, హోదా లేకపోతే ఏ పార్టీ అధికారంలోకివచ్చినా రాష్ట్రానికి చేసేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై ఒకసారి మాట్లాడుతున్నారని, ఒకసారి మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. పవన్ కూడా వచ్చి పోరాడితే బాగుంటుందని శివాజీ వ్యాఖ్యానించారు.