ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 వేషాలతో అలరించబోతున్నాడు చియాన్ విక్రమ్. వరల్డ్ సినిమా హిస్టరీలో ఒక నటుడు వేయగలిగింది ఇప్పటివరకూ 12 గెటప్పులు మాత్రమే. అది కూడా ప్రియాంక చోప్రా `వాటీజ్ యువర్ రాశీ` అనే చిత్రంలో ఇన్ని గెటప్పులు వేసింది. అంతకుముందు `దశావతారం`లో కమల్ హాసన్ 10 గెటప్పులు వేశారు. తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్ నటించిన క్లాసిక్ చిత్రం నవరాత్రి లో 9 గెటప్పులు ధరించారు. అటు హాలీవుడ్ లో అయితే ప్రఖ్యాత హాస్యనటుడు ఎడ్డీ మర్ఫీ ఒకే చిత్రంలో 7-8 పాత్రల్లో కనిపించాడు. కమింగ్ టు అమెరికా- ది నట్టీ ప్రొఫెసర్ చిత్రాల్లో అన్నేసి పాత్రల్లో కనిపించారాయన. వీళ్లందరినీ కొట్టేసేలా విక్రమ్ ఏకంగా 25 పాత్రల్లో కనిపించనున్నాడన్నది కోలీవుడ్ హాట్ న్యూస్.
ఒకటి కాదు రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అన్నది చియాన్ కి కొత్తేమీ కాదు. అపరిచితుడు చిత్రంలో రామూ..రెమో.. అపరిచితుడుగా మూడు రకాల వేషాలతో అదిరిపోయే నటనను కనబరిచాడు. ఇప్పటివరకూ విక్రమ్ బెస్ట్ పెర్ఫామెన్స్ అది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా 25 పాత్రల్లో నటిస్తున్నాడు. శివపుత్రుడు చిత్రంలో మూగవాడిగా అద్భుత నటన కనబరిచిన విక్రమ్ తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. ఇటీవల వచ్చిన మిస్టర్ కె కె ప్రేక్షకులను నిరాశపరిచినా విక్రమ్ నటనకు పేరొచ్చింది.
ప్రస్తుతం కెరీర్ 58వ చిత్రంలో 25 గెటప్పుల్లో అదరగొట్టబోతున్నాడన్నది అభిమానుల్ని నిలవనీయడం లేదు. మరో భారీ ప్రయోగానికి తెరదీసిన విక్రమ్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చియాన్ సరసన ట్యాలెంటెడ్ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.అక్టోబర్ 4నుండి రెగ్యులర్ చిత్రీకరణ సాగనుంది. 7 స్క్రీన్ స్టూడియోస్- వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.