టీడీపీకి షాక్…ఆ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు…!

High Court Declares Madakasira Tdp Mla Eranna Election Invalid

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. శాసనసభ్యుడిగా ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఆయనపై పోటీచేసిన వైసీపీకి చెందిన తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరన్న దాఖలు చేసిన అఫిడవిట్‌లో అవాస్తవాలు చెప్పారని, అనేక విషయాలు దాచారని ఆయనపై పోటీ చేసన మోపురగుండు తిప్పేస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘ కాలంగా విచారణ జరిపిన హైకోర్టు చివరికి అఫిడవిట్ విషయంలో ఈరన్న తప్పుల్ని నిర్ధారించి ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆయన స్థానంలో మోపురగుండు తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగువచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి తీర్పు చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో.. తనపై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్‌లో పేర్కొనలేదని తిప్పే స్వామి పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే ఈరన్నకి కర్ణాటకలో నమోదైన ఓ కేసులో శిక్ష కూడా పడినట్లు తిప్పేస్వామి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.

Tdp-Mla-Eranna

అయితే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, కుల సర్టిఫికెట్ల కారణాలతో గతంలోనూ.. పలువురు ఎమ్మెల్యేల ఎన్నికను కోర్టులు కొట్టి వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో పై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా కోర్టు తీర్పు వల్ల పదవి పోగొట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. పదవి కాలం అయిపోయిన తర్వాత తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈరన్న తాను తీర్పుపై అప్పీల్ చేసుకంటానంటున్నారు. తపై వైసీపీ నేత తిప్పే స్వామి చేసిన ఆరోపణలన్నీ కరెక్ట్ కాదంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఈరన్న పదిహేను వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికను కోర్టు కొట్టి వేస్తే రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి పదవి ఇవ్వడం అనే సంప్రదాయం కానీ నిబంధన కానీ లేదని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందంటున్నారు. చూడాలి ఈ కేసులో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో.