ఆర్జీవీ భయపడ్డాడుగా – భైరవ గీత రిలీజ్ వాయిదా

RGV Bhairava Geetha Movie Postponed

రామ్ గోపాల్ వర్మ, ఒకప్పటి సంచలన సినిమాలకి బ్రాండ్ గా నిలిచిన ఈ పేరు, ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకి, చౌకబారు సినిమాల కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. 2005 లో తాను తీసిన సర్కార్ సినిమా తరువాత మళ్ళీ ఇప్పటివరకు అసలు సిసలైన హిట్టు కొట్టలేకపోయిన ఆర్జీవీ తన మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం వదిలిపెట్టకుండా, తనదైన శైలి ప్రమోషన్లతో తన సినిమాలకి కావాల్సిన బజ్ ని కల్పించుకొని, ఓపెనింగ్స్ ని మాత్రం రాబట్టుకుంటూ వస్తున్నాడు. 2010 లో ఆర్జీవీ తీసిన రక్త చరిత్ర కాస్త బాగానే ఆడినా అసలు సిసలైన హిట్టుగా మాత్రం నిలవలేకపోయింది. ఇక తాను నాగార్జున తో 25 ఏళ్ళ తరువాత తీసిన ఆఫీసర్ సినిమా కనీసం లక్ష రూపాయల ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేక నాగార్జున సినిమా చరిత్రలోనే ఒక పీడకల గా మారింది. తన నిర్లక్ష్యధోరణితో నాగార్జున తన జీవితాంతం మరిచిపోలేని ప్లాపు ని ఇచ్చాక కూడా “నేను అఖిల్ తో సినిమా చేయబోతున్నాను” అని డాంబికాలకు పోతున్న ఆర్జీవీ మాటలను తెలుగు ప్రేక్షకులే కాదు అఖిల్ కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు ఆర్జీవీ తాను ట్విట్టర్ లో తెలిపిన ఈ విషయానికి రిప్లై ఇవ్వకుండా.

bhairava geetha movie teaser release on tomorrow

ఇక అసలు విషయానికి వస్తే, ఆర్జీవీ సమర్పణలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం “భైరవ గీత”. కన్నడ నటుడు ధనంజయ మరియు ఇర్రా మోరే లు నటించిన ఈ చిత్రంతో సిద్ధార్థ తథోలు అనే 23 ఏళ్ళ కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా విడుదలని శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన రోబో 2.0 సినిమాకి ధీటుగా నవంబర్ 30 న విడుదల చేస్తున్నామని ఆర్జీవీ ప్రకటించాడు. రోబో 2.0 చిత్రం నవంబర్ 29 న విడుదల అవ్వబోతుంది. అంతేకాకుండా శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో, తన శిష్యుడైన యువదర్శకుడు సిద్ధార్థ తథోలు ని పోల్చుతూ, శంకర్ తీసిన రోబో 2.0 చిన్న పిల్లల సినిమా అని, తమ భైరవ గీత సినిమా పెద్దవాళ్ళ కోసం తీసిన సినిమా అంటూ విమర్శలు కూడా చేశాడు. ఇలా రోజుకో అవాకులు-చెవాకులు పేలుస్తున్న ఆర్జీవీ రోబో 2.0 కి ఉన్న క్రేజ్ చూసి భయపడ్డాడో ఏమో గానీ భైరవ గీత సినిమాని డిసెంబర్ 7 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి ఆర్జీవీ చెప్తున్నా కారణం సెన్సార్ కి సంబంధించిన సాంకేతిక సమస్యలు అంటా.