బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు.
దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు.
అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి.