బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి ఐదో సీజన్ ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా క్వారంటైన్‌కి వెళ్లారు. ఇక గత రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా చేయనున్నాడు.
సీజన్ 5కి సంబంధించి ప్రోమోలు కూడా ఇప్పటికే వచ్చేశాయి. గత నాలుగు సీజన్స్ సూపర్ హిట్ అవ్వడంతో ఐదో సీజన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలతో పాటు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఐదో సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో 9.30 గంటలకు ప్రసారం అయ్యే బిగ్‌బాస్ షో ఈ సారి రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ కావడంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఆ సమయంలో షోని ప్రేక్షకులు చూస్తారా? అనేది కాస్త అనుమానించాల్సిందే. దీంతో పాటు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో ముందే లీకవ్వడం.. ఐదో సీజన్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ 5 భారీ టీఆర్పీ రేటింగ్‌ని నమోదు చేయడం కాస్త కష్టమే.
మరోవైపు జెమినీ టీవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి బిగ్ బాస్ షో కి రేటింగ్స్ విషయంలో పోటీ ఎదురవుతోంది. ఒకవేళ ఎవరు మీలో కోటీశ్వరులు కంటే బిగ్‌బాస్ షో టీఆర్పీ రేటింగ్ తక్కువగా ఉంటే ఐదో సీజన్ ప్లాప్ అనే ముద్రపడడం ఖాయం. అయితే గత సీజన్‌లో కూడా ఇలాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ.. బిగ్‌బాస్ షో టీఆర్పీ రేటింగ్ మాత్రం తగ్గలేదు. మరి ఈ సారి కూడా అదే హిస్టరీ రిపీట్ అవుతందో లేదో చూడాలి.