అమిత్ షా నోట్ల వ్యవహారం ఇన్నాళ్ళకి ఇలా !

highest banned notes amit shah dccb bank RTI Reply

పెద్ద నోట్ల రద్దు… మోడీ ప్రధాని అయ్యాక తీసుకున్న అత్యంత ప్రభావమైన, ప్రతిష్టాత్మక చర్యగా దీనిని బీజేపీ భావిస్తూ ఉంటుంది. అయితే అప్పట్లో పెద్ద నోట్ల రద్దు గురించి అధికార పార్టీ వారికి ముందుగానే తెలుసునని వారు ముందరే జాగ్రత్త పడ్డారని అప్పట్లో విమర్శలు కూడ వచ్చాయి. అయితే బీజేపీ ఆ విమర్శలను తిప్పికొట్టినా నోట్ల రద్దు మాత్రం కాషాయ నేతలకు వరంగానే మారినట్టు తేలింది. ఓ సమాచార హక్కు కార్యకర్త ద్వారా బయటపడ్డ వివరాలు ఈ విషయం నిజమేనని ధ్రువీకరిస్తున్నాయి. అదేంటంటే నోట్ల రద్దుతో కొన్ని బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తాయంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటి బ్యాంకుల్లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ కూడా వుంది.

సాధారణంగా అయితే, దీనికి అంత ప్రాధాన్యత వచ్చేది కాదుగానీ, ఆ సహాకార బ్యాంక్ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉండడమే విశేషమైంది. రద్దు అయిన నోట్లను జమచేసుకున్న బ్యాంకుల్లో దేశంలోనే ఆ బ్యాంకు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రెండు జిల్లా సహకార బ్యాంకులు నోట్ల రద్దును లాభదాయకంగా మార్చుకున్నాయి. ఇందులో అహ్మదాబాద్‌ డీసీసీబీ ఒకటి కాగా, రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ సమాచార హక్కు పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు.

నవంబరు 8, 2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో అహ్మదాబాద్ డీసీసీబీలో ఏకంగా రూ. 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమయ్యాయి. రాజ్‌కోట్ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్ అయ్యాయి దీంతో ఇవి రెండు దేశంలోనే అత్యధిక పెద్ద నోట్లు జమ అయిన బ్యాంక్ లుగా నమోదయ్యాయి. సహకార బ్యాంక్ ల ద్వారా నల్లధనాన్ని అనేకమంది వైట్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు జమ చేసే బ్యాంకుల జాబితా నుంచి సహకార బ్యాంక్ లను నవంబరు 14న అంటే ఐదు రోజుల తరువాత తొలగించింది. కానీ అప్పటికే వేల కోట్ల రూపాయల మేర జమ అయిపోయాయి. అహ్మదాబాద్ డీసీసీబీకి 2000 సంవత్సరంలో షా చైర్మన్‌గా వ్యవహరించి ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సహకార బ్యాంకుల్లో వేల కోట్లు జమ అయినా, జమ చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదని ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ చెబుతున్నారు. అలా అ ఐదు రోజుల్లో జమ అయిన కోట్ల రూపాయలు పెద్ద తలకాయలకి చెందినవి కావడం వలనే ఎటువంటి విచారణా చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు.