పంజా విప్పిన పనామా లీక్స్… 12000 భారతీయుల పేర్లు !

Panama Paper New documents show many indians

రెండేళ్ళ క్రితం కలకలం సృష్టించిన పనామా లీక్స్‌ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే పనామా లీక్స్ మళ్ళీ దేశ రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వరుస లీక్స్‌తో అక్రమార్కులను గడగడలాడించిన ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే), జర్మన్‌ పత్రిక సుడెషె జుటెంగ్‌లు పనామా లీక్స్ తాజా జాబితాను విడుదల చేశాయి. దాదాపు 12 లక్షల కొత్త డాక్యుమెంట్లను ఇప్పుడు విడుదల చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం పరిశోధనల్లో మన దేశం నుంచి భాగస్యామ్యం అయిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. తాజా జాబితాలో భారతీయులకు చెందిన 12000 పత్రాలు ఉన్నట్లు సమాచారం. వీరికి సంబంధించిన వివరాలను ఈరోజు ప్రచురించింది. బ్లాక్ మనీ పెట్టడానికి అనువైన దేశాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి బ్లాక్ మనీని తరలించిన అనేక కంపెనీ భాగోతాలను పనామా లీక్స్‌ బహిర్గతం చేసింది.

అయితే ఇక్కడ మరొక మెలిక పెట్టింది అదేంటంటే తాము సమీకరించిన డేటాను మాత్రమే బహిర్గతం చేస్తున్నామని ఇందులో పేర్కొన్నవారందరూ నల్లధన కుబేరులు కాదని నిబంధనల ప్రకారం సొమ్ము దాచుకునేవారు కూడా ఉండొచ్చని ఐసీఐజే పేర్కొంది. ఇవాళ విడుదల చేసిన పనామా లీక్స్‌ -2లో భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ యజమాని సునీల్‌ మిట్టల్‌ కుమారుడు కెవిన్‌ సునీల్‌ మిట్టల్‌కు చెందిన పలు కంపెనీల వివరాలను ఐసీఐజే వెల్లడించింది. పీవీఆర్‌ సినిమా కంపెనీ ఛైర్మన్‌ అజయ్‌ బిజ్లి, ఏషియన్‌ పెయింట్స్‌ ప్రమోటర్‌ ఆశ్విన్‌ డాని కుమారుడు జలజ్‌ అశ్విన్‌ డాని పేరు కూడా పనామా లీక్స్‌లో ఉంది. తాజా జాబితాలో కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2016లో వెల్లడైన జాబితాలో బయటపడిన యజమానులు, వారి కంపెనీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఇప్పుడు పనామా లీక్స్ విడుదల చేసింది. వాటి సారాంశం ఆయా దేశాల్లో నెలకొల్పిన కంపెనీలను మూసేయాలని కొందరు సూచించగా కొందరు కొనసాగించేందుకు ఇష్టపడ్డారు. 2016లో పనామా లీక్స్‌లో బయటపడిన పేర్లలో అమితాబ్ బచ్చన్‌, జెహంగీర్‌ సొరాబ్జి, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్‌, శివ ఖెమ్కాపేర్లు ఉన్నాయి.