కేటీఆరా.. ఆయనెవరో తెలియదన్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచారు. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడీ షేమింగ్ ట్వీట్‌పై వైఎస్ షర్మిల స్పందించారు. రాజకీయ నేతల కుటుంబ సభ్యులను కించపరిచే ప్రకటనలను సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో గుండాయిజాన్ని ఖండిస్తున్నా అంటూనే పొలిటిషియన్స్ ఇంట్లో మహిళలను కించపరిచినా.. పిల్లలను కించపరిచినా అందరూ ఒక్కటవ్వాలని ట్వీట్ చేశారు.
కేటీఆర్‌కు మద్దతుగా షర్మిల ట్వీట్ చేయడం కొంత ఆసక్తిని కలిగిస్తోంది. ఓ ప్రెస్ మీట్లో కేటీఆర్‌పై ఆమె ఆశ్చర్యకరమైన కామెంట్లు చేశారు. తనకు కేటీఆర్ అంటే ఎవరో తెలియదన్నారు. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని, కేటీఆర్ కూడా మహిళలను గౌరవించేలా కనిపించడం లేదన్నారు. మహిళలంటే ఇంట్లో పూజలు, వ్రతాలు చేసేవారిలానే టీఆర్ఎస్ భావిస్తున్నట్టు ఆమె కామెంట్ చేశారు. అదే ఇప్పుడు షర్మిలా కేటీఆర్‌కు అనుకూలంగా ట్వీట్ చేయడం గమనార్హం.
కాగా అభివృద్ధి విషయమై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న… అభివృద్ధి ఎక్కడ జరిగిందని.. భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దాంతో టీఆర్ఎస్ నేతలు దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఆఫీసుపై కూడా దాడి జరిగింది. దానిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ దీనిపై మల్లన్న పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. టీఆర్ఎస్ గూండాలే తన ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని, భౌతిక దాడులు తనను ఆపవంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.