కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. కరోనా రష్యా, బ్రిటన్, చైనా దేశాల్లో మరోసారి కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే డెల్టాకు సంబంధించిన కొత్త వేరియంట్ ఏవై 4.2 ఉనికి దేశంలోని పలు రాష్ట్రాల్లో కనిపించడం ఆందోళన రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు. పాటిల్‌కు బుధవారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏడాది వ్యవధిలో ఆయనకు రెండోసారి కరోనా సోకింది. మరోవైపు ఆయన రెండు మోతాదుల టీకా కూడా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబరులో పాటిల్‌కు కరోనా నిర్ణారణ అయింది.
స్వల్ప కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోవడంతో తనకు పాజిటివ్ వచ్చిందని పాటిల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. అలాగే నాగపూర్, అమరావతి పర్యటనల్లో భాగంగా, ఇతర కార్యక్రమాల్లో తనతోపాటు పాల్గొన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ పాటిల్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు.
మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం గురువారం కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 16,156 కొత్త కేసులు నమోదు కాగా, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 17,000 మంది కోలుకున్నారు. అటు మహారాష్ట్రలో కొత్తగా 1485 కేసులు, 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,03,536 కు చేరింది.