నంద్యాల పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు యువకులు మద్యం మత్తులో హోంగార్డును చంపేశారు. త్రీటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఎంఎస్ నగర్‌కు చెందిన చిన్నబాబు ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు స్నేహితులు నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన బాలిరెడ్డి, మహమ్మద్‌గౌస్, మహమ్మద్ రఫితో కలిసి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద మద్యం కొనుగోలు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్టేషన్ సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ ప్రాంతంలోకి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం సేవించి ఆ తర్వాత కేకలు వేస్తూ బైక్‌లపై బయటకు వస్తుండటంతో హోంగార్డు కుమ్మరి రాజశేఖర్ అడ్డుకున్నాడు. మద్యం సేవించి కేకలు వేయడం మంచిది కాదని వారించాడు.
కాగా మద్యం మత్తులో ఉన్న యువకులు రాజశేఖర్‌పై దాడికి పాల్పడి పక్కకు తోయడంతో ఇనుప గేటు కు తల బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో హోంగార్డు రామసుబ్బయ్య గమనించి అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ రఘువీరారెడ్డి మృతుడి కుటుంబీకులను పరామర్శించారు.