Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విలాసాలు, రాజభోగాల మధ్య జీవితం గడిపిన గుర్మీత్ బాబా దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతోంది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ గడువు ముగిసిన తర్వాత ఆమెను అంబాలా సెంట్రల్ జైలు కు తరలించారు. జైల్లో తొలిరోజు … ఆమె నిద్రలేని రాత్రి గడిపింది. భోజనం కూడా చేయకుండా రాత్రంతా జాగారం చేసింది. జైలుకు తరలించిన వెంటనే… ఆమె గుర్మీత్ ను ఒక్కసారి చూపించాలని అధికారులను వేడుకుంది. కానీ ఆ కోరిక తీరే అవకాశం లేకపోవడంతో…. ఆమె నిరాశచెందింది. తిండి, నిద్ర లేకుండా…రాత్రంతా మేలుకునే ఉంది. జైల్లో హనీప్రీత్ ఉన్న బ్యారక్ లోనే ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా ఉంది. దీంతో జైలు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అంబాలా ప్రాంతంలో డేరా మద్దతుదారులు వేలాదిగా ఉండడం, జైల్లోనూ వారికి అనుకూల వర్గాలు ఉండడంతో నిఘా పెంచామని అధికారులు తెలిపారు. ఇతర మహిళా ఖైదీలను వారితో కలవనివ్వలేదని చెప్పారు. అంతకుముందు హనీప్రీత్ కు వైద్యపరీక్షలు నిర్వహించారు. నిందితులను జైలుకు తరలించే ముందు సాధారణంగా నిర్వహించే వైద్యపరీక్షలనే ఆమెకూ జరిపారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, బీపీ పెరిగిందని హనీప్రీత్ వైద్యులతో చెప్పింది. అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటలపాటు హనీప్రీత్ ను పరీక్షించి ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉందని నిర్ధారించారు. ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని తెలిపారు