Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇద్దరు సాధ్విలపై అత్యాచారం కేసులో గుర్మీత్ బాబా దోషిగా నిర్ధారణ అయిన తరువాత చెలరేగిన అల్లర్ల కేసులో నిందితురాలుగా ఉన్న హనీప్రీత్ అంబాలా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా హనీప్రీత్ ను కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు వెళ్లారు. వారిని చూసి హనీప్రీత్ భోరున విలపించింది. హనీప్రీత్ తల్లి ఆశా, తండ్రి రామానంద్, సోదరుడు సాహిల్ ఆమెను కలిసేందుకు వచ్చారన్న సమాచారం తెలుసుకున్నస్టేషన్ హౌస్ ఆఫీసర్ రజనీశ్ కు ఓ అనుమానమొచ్చింది. వచ్చిన వారు నిజంగా హనీప్రీత్ తల్లిదండ్రులేనా అని ఆయనకు సందేహం కలిగింది. దీంతో అనేక రకాలుగా ఆయన వారి నుంచి వివరాలు సేకరించారు. వారి మాటలను బట్టి తల్లిదండ్రులే అని నిర్దారించుకున్న తర్వాత హనీప్రీత్ తో ఇంటర్ కామ్ ద్వారా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అరగంట పాటు తల్లిదండ్రులు, సోదరుడు హనీప్రీత్ తో మాట్లాడారు. వారిని చూసి హనీప్రీత్ దుఃఖం ఆపుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించింది.
దీపావళి సందర్బంగా వారు కుమార్తెకు స్వీట్లు, కొవ్వుత్తులు ఇచ్చారు. హనీప్రీత్ తల్లిదండ్రుల వెంట వారి న్యాయవాది కూడా ఉన్నారు. కానీ అధికారులు లాయర్ ను హనీప్రీత్ తో మాట్లాడనివ్వలేదు. డేరా బాబా అరెస్టు తర్వాత అనేక రోజులు అజ్ఞాతంలో గడిపిన హర్మీత్ సింగ్…ఓ జాతీయచానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ హర్యానా పోలీసులకు పట్టుబడింది. పోలీసుల విచారణలో మొదట నోరు మెదపని హనీప్రీత్ చివరకు అల్లర్లలో తన ప్రమేయముందని అంగీకరించింది. విచారణలో భాగంగా రాజస్థాన్ లోని గురుసర్ మోదియాలో హనీప్రీత్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను పోలీసులు సీజ్ చేశారు. ముంబై, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ హనీప్రీత్ కు ఆస్తులున్నట్టు గుర్తించారు