కోవిడ్‌-19 రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు

కోవిడ్‌-19 రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు

దొరికిందే చాన్స్‌ అన్నట్టుగా కోవిడ్‌-19 రోగులనుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రికి థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ భలే షాక్‌ ఇచ్చింది. భారీగా చార్జీలు వసూలు చేసిన ఒక ప్రైవేటు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసింది.

కరోనా వైరస్‌తో ఆసుపత్రిలో చేరిన రోగులనుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలతో మహారాష్ట్ర, థానే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను శనివారం నిలిపి వేసింది. అలాగే కోవిడ్‌-19 సెంటర్‌ను కూడా రద్దుచేసింది. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడిట్‌ కమిటీ నివేదిక మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

15 ఆస్పత్రుల ద్వారా 27 లక్షల రూపాయల మర అదనపు చార్జీలను వసూలు చేసినట్టు ఆడిట్ కమిటీ నివేదించింది. దీని ఆధారంగా ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను ఒక నెల పాటు నిలిపివేసినట్లు మున్సిపల్‌ అధికారి తెలిపారు. జూలై 12 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 797 మంది రోగుల నుంచి 56 బిల్లుల్లో 6,08,900 రూపాయలను అదనంగా వసూలు చేసిందని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సను పర్యవేక్షించడానికి, వారికి చార్జీల భారం లేకుండా నియంత్రించేందుకు ఇద్దరు అధికారులను నియమించామన్నారు. మరోవైపు అసుపత్రులపై నిఘా కొనసాగుతుందనీ, మిగిలిన ఆసుపత్రులపైకూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాలావి ప్రకటించారు.