ఓ మహిళ కడుపు నొప్పి వస్తోందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఆమెను పరీక్షించిన వైద్యుడు మందులకు బదులు కండోమ్ రాసిచ్చాడు. ఆ విషయం తెలియక మందుల దుకాణానికి వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కండోమ్ ప్యాకెట్ ఇచ్చిన దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె చివరికి అసలు విషయం తెలిసి షాకైంది.
ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ఘట్‌శీలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ నెల 23న ఓ మహిళ కడుపు నొప్పితో వైద్యుడు అష్రఫ్ బాదర్ ను కలిసింది. వైద్య పరీక్షల తర్వాత బాదర్ ఆమెకు మందుల చీటి రాసిచ్చాడు. మెడికల్ షాప్‌కు వెళ్లిన ఆమెకు దుకాణదారుడు కండోమ్ ప్యాకెట్ ఇచ్చాడు.
దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. డాక్టర్ తనకు మందులు రాస్తే ఇదెందుకు ఇస్తున్నావని ప్రశ్నించింది. డాక్టర్ మందుల చీటిలో కండోమ్‌లు రాశాడని దుకాణదారుడు తెలిపాడు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు మానసిక వైద్యుడితో సహా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. జేఎంఎం శాసనసభ్యుడు కునాల్ సారంగి ఈ ఘటనను అసెంబ్లీలో లేవనెత్తడంతో అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణ తర్వాత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.