ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కేవలం నాలుగు వేల రూపాయల బిల్లు కోసం ఆస్పత్రి యాజమాన్యం ఓ రోజు కూలీని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో అతడి బంధువు చమన్, సుల్తాన్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్యం కోసం ఎంత ఖర్చవుతుందని చమన్ డాక్టర్లును అడిగాడు. అయితే వారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాక చెప్తాం ముందు రూ.5 వేలు కట్టమని చెప్పారు. చమన్ అలానే చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రి వర్గాలు మరో నాలుగు వేలు చెల్లించాలని చెప్పారు.
అప్పుడు చమన్ ముందే ఐదువేలు కట్టామని చెప్పడంతో అవి బెడ్ చార్జెస్ అన్నారు. దాంతో చమన్ తాము అంత డబ్బు చెల్లించలేమని.. డిశ్చార్జ్ చేయమని కోరాడు.అయితే ఆస్పత్రి యాజమాన్యం మిగతా నాలుగువేలు చెల్లిస్తేనే సుల్తాన్‌ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. దాంతో చమన్‌కి, ఆస్పత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో హస్పటల్ స్టాఫ్ సుల్తాన్‌పై కర్రలతో అమానుషంగా దాడిచేశారు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీటీవీ కెమరాలో రికార్డయ్యాయి. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశాం.. దర్యాప్తు చేస్తామని తెలిపారు.