భారత దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. కరోనా వైరస్ ప్రవేశించాక ఓటీటీలదే రాజ్యంగా మారిపోయింది. లాక్ డౌన్ల కారణంగా చాలా కాలం థియేటర్లు మూతపడడం, ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో రెండేళ్లలో చాలా మంది ఓటీటీలకు అలవాటు పడ్డారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే భారతీయులు ఎక్కువగా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను చూస్తున్నారన్న గణాంకాలు బయటికి వచ్చాయి. జస్ట్ వాచ్ అనే సంస్థ వీటిని వెల్లడించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను ఎంత శాతం మంది చూశారంటే..
2021 మూడో త్రైమాసికంగా భారతీయులు ఎక్కువగా చూసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా డిస్నీప్లస్ హాట్‌స్టార్ నిలిచింది. వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది ఈ ప్లాట్‌ఫామ్. ఏకంగా 25శాతం మంది హాట్‌స్టార్ ను స్ట్రీమ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో 20 శాతం ఉండగా.. ఇప్పుడు ఐదు శాతం పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ నిలిచింది. విభిన్న కంటెంట్ వస్తున్న ప్రైమ్ కు 19 శాతం దక్కింది. మరోవైపు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ 17 శాతంతో మూడో స్థానం దక్కించుకుంది.హాట్‌స్టార్ దూకుడుతో నెట్‌ఫ్లిక్స్ షేర్ రెండు శాతం పడిపోయింది. కాగా జీ5 9 శాతంతో నాలుగో ప్లేస్ లో, వూట్ ఆరు శాతం షేర్ తో ఐదో స్థానంలో ఆ తర్వాత చెరో 5 శాతంతో సోనీ లివ్, జియో సినిమా నిలిచాయి. ఆల్ట్ బాలాజీకి 4 శాతం మాత్రమే దక్కగా.. మిగిలినవన్నీ కలిపి 10 శాతం దక్కించుకున్నాయి.
కరోనా విలయం తర్వాత క్రికెట్ పోటీలు మళ్లీ ప్రారంభం కావడం హాట్‌స్టార్‌కు బాగానే కలిసొచ్చిందని చెప్పాలి. ఈ ఏడాది రెండు విడతలుగా జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమ్ అయింది. ఈ టోర్నీకి సైతం హాట్‌స్టార్ లో చాలా మంది వీక్షించారు. అలాగే ఇటీవల యూఏఈలో ముగిసిన టీ20 ప్రపంచకప్ కూడా హాట్‌స్టార్ లోనే స్ట్రీమ్ అయింది. దీంతో క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే భారతీయులు ఎక్కువ మంది హాట్‌స్టార్ వైపు చూస్తున్నారు. అలాగే కొన్ని ఒరిజినల్స్, సినిమాలు సైతం హాట్‌స్టార్ ను టాప్ లో నిలిపాయి. బుర్జ్, షిద్దత్, హమ్ దో హమారే దో లాంటి ఒరిజినల్స్ దుమ్మురేపాయి. ముఖ్యంగా మార్వెల్ కంటెట్ కూడా హాట్‌స్టార్ ఎదుగుదలకు కారణంగా మారుతున్నాయి. అలాగే బ్లాక్ విడో ప్రత్యేకంగా హాట్‌స్టార్ లోనే విడుదలవడం కూడా ఈ త్రైమాసికంలో ఆ ప్లాట్‌ఫామ్ వృద్ధికి మరో కారణం.