ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు క్రేజ్ మాములుగా ఉండదు. అదే క్రేజ్ యాపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించడానికి ఎంతగానో దోహదం చేసింది. యాపిల్ ఎక్కడ రాజీ పడకుండా ఉత్పత్తులను రెడీ చేస్తోంది. ప్రపంచంలో నెంబర్ వన్ టెక్ దిగ్గజంగా నిలిపేందుకు కృషి చేస్తోన్న ఉద్యోగులకు యాపిల్ అదిరిపోయే రేంజ్‌లో శాలరీను అందిస్తుంది.కంపెనీలో పనిచేస్తోన్న సుమారు వెయ్యికిపైగా టాప్ ఇంజనీర్స్, డెవలపర్స్‌కు అందించే జీతాల సమాచారాన్ని యూఎస్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్-2021లో యాపిల్ పొందుపర్చింది.
కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ ఏడాది గాను దాదాపు 95 లక్షల నుంచి రూ. 1.63 కోట్ల జీతాన్ని పొందుతున్నారు. ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు గరిష్టంగా రూ. 1.78 కోట్ల జీతాన్ని దక్కించుకుంటున్నారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఏకంగా రూ. 1.86 కోట్ల ప్యాకేజ్‌ను పొందుతున్నారు. టెస్ట్‌ల నిర్వహణ కోసం వాడే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లకు, ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజనీర్స్ వరుసగా రూ. 1.02 కోట్లు, రూ. 1.11 కోట్లను యాపిల్ ముట్ట చెపుతోంది.
యాప్లికేషన్ డెవలప్ చేసే ఇంజనీర్లు ఏడాదికి సుమారు రూ. 93 లక్షలను పొందుతున్నారు. చివరగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఇంజనీర్స్‌కు ఏడాదిగాను సుమారు రూ. 89 లక్షలు నుంచి రూ. 1.83 కోట్లను ప్యాకేజ్‌ను యాపిల్ అందిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. అమెరికాలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఈ స్థాయిలో జీతాలను పొందుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలను యాపిల్ వెల్లడించలేదు.