అట్లతద్ది ఎలా జరుపుకోవాలి?

How to celebrate Atla Tadde

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు.

గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకూ ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్ళు కూడా తాగరు.

అట్లతద్దినాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాల ఊగుతారు. పరవశంగా ఊయల ఊగుతూ

”అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్…”

లాంటి సరదా పాటలు పాడుకుంటారు.

గౌరీదేవికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానిస్తారు.

అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.

పూజలో చేతులకు చేమంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.

పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు.

ఒక పళ్ళెంలో బియ్యం పోసి, మధ్యమధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి, అందులో పసుపు కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు.

పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్లతద్ది కథ చదువుతారు.

ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, పైన గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.

అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు, ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.

వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే.

వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.

”ఇస్తినమ్మ వాయనం”

”పుచ్చుకుంటినమ్మ వాయనం”

”అందించానమ్మా వాయనం”

”అందుకున్నానమ్మా వాయనం”

”ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం”

”ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం”

ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ”అట్లతద్ది” జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ”కార్వా చౌత్” వేడుకతో సమానం. చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే ”సెయింట్ ఆగ్నెస్ ఈవ్” మన అట్లతద్ది పండుగలాగే ఉంటుంది.

ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాల ప్రభావంతో ”అట్లతద్ది” లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారం సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయం మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళయిన స్త్రీలు ”అట్లతద్ది” జరుపుకుంటున్నారు.

 

“అట్లతద్దె” వ్రతమహిమ:

పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమెపేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రతమహిమను తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని.. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది.

దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహములు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కానీ కావేరిపై యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా తారసపడసాగిరి.

మహారాజు ప్రయత్నములన్నీ విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది.. రాజ్యమును వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది.

అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి. ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.

దానితో నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిందేమీ లేదని, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరించు. నీ మనోభిష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతజ్ర్ధానమైనారు.

అలా ఆ రాకుమార్తె తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహముతో అష్టైశ్వర్యాలను పొందుదుముగాక..!