దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధుల్లో డెంగీ ఒకటి. డెంగీ వైరస్ ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏఈ అల్బోపిక్టస్ జాతి దోమలు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేయగలవు. ఈ దోమలు చికెన్‌గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. డెంగీ జ్వరం ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్లెట్స్ క్షీణిస్తుంటాయి. ఆ సమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.దోమ కాటు తర్వాత డెంగీ వ్యాధి సోకిన వారిలో.. 4-10 రోజుల వరకు వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 2-7 రోజుల పాటు లక్షణాలు ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెంగీని రెండు వర్గాలుగా విభజించింది. లక్షణాలు లేని, సాధారణ లక్షణాలు బయటపడే డెంగ్యూ.. తీవ్రమైన డెంగీగా ఇన్ఫెక్షన్ను వర్గీకరించింది. డెంగీ బాధితుల్లో తీవ్రమైన జ్వరం ఉంటుంది. దీంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులతో బాధపడతారు.
వికారం, వాంతులు, శరీర గ్రంథులు ఉబ్బటం, దద్దుర్లు వంటివి కూడా సాధారణ డెంగీ లక్షణాలుగా గుర్తిస్తారు. జ్వరంతో పాటు ఏవైనా రెండు ఇతర లక్షణాలు కనిపిస్తే.. అది డెంగీ అనే అనుమానించాలి.శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో ప్లేట్లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చని వైద్యులు చెప్తున్నారు.దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ప్లేట్‌లెట్స్‌ను పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారుబొ.
బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిదని తెలుసు. కానీ కేవలం బొప్పాయి పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆకు రుచి మాత్రం కాస్తా చేదుగానే ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి ఆకు తప్పకుండా తీసుకోవాలి.ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా ఇటీవల కాలంలో గోధుమగడ్డి అనే ఆహారం గురించి ప్రతీ ఒక్కరూ ఆరాతీస్తున్నారు. అవును ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో కాస్తా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎండుద్రాక్ష శరీరంలో ఐరన్ ఉత్పత్తి చేయడానికి గొప్ప వనరు. ప్లేట్లెట్స్ చాలా తక్కువగా ఉన్న డెంగీ రోగులకు ఎండుద్రాక్షలు సహాయపడతాయి. ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టుకుని వాటిని ఉదయం తింటే రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్న రక్తహీనత రోగులకు కూడా కిస్మిస్లు తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.చూడ్డానికే ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. ఈ కూరగాయ కూడా ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది.
ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ఫ్రీ రాడికల్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని డైట్లో చేర్చుకోవచ్చు. ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాలను జ్యూస్‌లా చేసుకోని తాగేయొచ్చు.
విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. అరటిపండు, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది.తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం రోగాలమయం కాకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్ శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్లెట్స్.