Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమా బిజినెస్ శక్తి ఎంత వుందో అర్ధం అయ్యింది. మార్కెటింగ్ వ్యూహాలు బాగా ఉంటే సినిమాని కూడా తక్కువ రిస్క్ , ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారంగా మార్చుకోవచ్చని నిరూపించిన సినిమా ఇది. దాని తర్వాత తెలుగు సినిమా పరిధి విస్తృతమైంది. శాటిలైట్ , ఓవర్ సీస్ మార్కెట్ , డిజిటల్ మార్కెట్ బాగా పెరిగిపోయి ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతున్నారు. ఈ ఒరవడికి తగ్గట్టు ఇంకో కొత్త ఆదాయ మార్గం కూడా టాలీవుడ్ కి వచ్చి చేరబోతోంది. మెగా స్టార్ చిరంజీవి ద్వారా ఈ ఆదాయ మార్గం టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. చిరు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి సినిమాకి ఊహించని ఆఫర్ తో ఈ ఆదాయ మార్గం బయటికి వచ్చింది.
భారీ సినిమాలు నిర్మాణంలో వున్నప్పుడు షూటింగ్ స్పాట్ లో ఎన్నో విశేషాలు ఉంటాయి. సినిమాతో పాటు వాటిని కూడా షూట్ చేసి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోడానికి అవకాశం ఇస్తే పెద్ద మొత్తం ఇస్తామని అమెజాన్ సంస్థ నిర్మాత రామ్ చరణ్ కి ఆఫర్ ఇచ్చిందట. ఈ ఆఫర్ బాగా టెంప్టింగ్ కూడా ఉన్నట్టు చెబుతున్నారు. చిత్ర నిర్మాణ వ్యయంలో దాదాపు 20 శాతం దీని ద్వారా వచ్చే అవకాశం ఉందట. రామ్ చరణ్ ఈ ఆఫర్ కి ఓకే చెబితే టాలీవుడ్ కి ఇంకో కొత్త ఆదాయ మార్గం దొరికినట్టే. సైరా తర్వాత కూడా కొత్త భారీ ప్రాజెక్ట్స్ కి ఈ మార్కెట్ అదనంగా వచ్చి చేరుతుంది. అయితే ఆదాయం ఎలా వున్నా షూటింగ్ పార్ట్ ముందుగా బయటికి వస్తే సినిమా మీద ఆసక్తి తగ్గుతుంది అన్న భయం మాత్రం ఫిలిం మేకర్స్ ని ఈ కొత్త మార్కెట్ విషయం లో కాస్త వెనక్కి లాగుతోంది.