రాయలసీమలో పవన్ కల్యాణ్ పర్యటనకు అనూహ్య స్పందన

రాయలసీమలో పవన్ కల్యాణ్ పర్యటనకు అనూహ్య స్పందన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనకు తొలి రోజు వచ్చిన స్పందన అనూహ్యం. ఆయన రేణిగుంట విమానాశ్రయానికి వచ్చేటప్పటికి స్వాగతం చెప్పడానికి వేల మంది గుమికూడారు. ఆ తర్వాత రైల్వే కోడురు వరకు దారిపొడవునా జనం ఉన్నారు. గ్రామకూడళ్లలో ఆయనకు పూలస్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. రైతు సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు. ఇంత అనూహ్యమైన స్పందన వస్తుందని జనసేన వర్గాలు కూడా ఊహించలేకపోయాయి. జనసేన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.

పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల ఓడిపోయారు. రాయలసీమలో జనసేన పార్టీ ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ జనసేన వర్గీయుల్లో ఉంది. ఇతర రాజకీయ పార్టీల్లా జన సమీకరణ చేయడం జనసేన విధానాలకు విరుద్ధం. ఒక వేళ చేయాలనుకున్నా వారికి అందుకు తగ్గ యంత్రాంగం లేదు. ప్రజలు పవన్ కల్యాణ్ కోసం స్వచ్చందంగా తరలి వచ్చారు.

కడపలో పవన్ కల్యాణ్‌కు ఇంత భారీ స్థాయిలో ఆదరణ ఉంటుందని జనసేన వర్గాలు మాత్రమే కాదు ఇతర పార్టీలు కూడా ఊహించలేకపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ఇది షాక్ లా తగిలింది. అందుకే.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు డబ్బులిచ్చి తీసుకు వచ్చారనే ప్రచారాన్ని ప్రారంభించారు. పాత వీడియోలతో పోస్టులు పెట్టారు. పాత వీడియోలు బయటకు రావడంతో వైసీపీ కార్యకర్తల ప్రచారం రివర్స్ అయినట్లయింది. పవన్ కల్యాణ్ సీమలోని మిగతా మూడు జిల్లాల్లోనూ పర్యటిస్తారు. ఆ తర్వాత రాయలసీమలో జనసేన కార్యాచరణ  ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆదరణను పార్టీ పరంగా మార్చుకుంటే జనసేన భవిష్యత్‌కు ఢోకా ఉండదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.