రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కూతురు, అల్లుడు, మరో వ్యక్తితో కలిసి భర్తను భార్య మట్టుబెట్టిన కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మోహన్‌రెడ్డి నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. పట్టణంలోని దేవనగర్‌కు చెందిన గోగుల నాగశేషు(38) ఈనెల 13న హత్యకు గురయ్యాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొంతకాలంగా నాగశేషు మద్యానికి బానిసై భార్య శ్రీదేవిని హింసించేవాడు.
దీంతో భర్త హత్యకు కూతురు లక్ష్మి, అల్లుడు డేరంగుల మీరావలితో పాటు దగ్గరి బంధువు సుబ్బరాయుడు కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఈనెల 13న రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న నాగశేషును రోకలిబండతో మోది, కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు అల్లుడు ఆటో తీసుకుని బయలుదేరాడు. వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ఆటో వదిలి పారిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.