ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత అని, దేశంలో ఆకలిచావులు సంభవించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమ్యూనిటీ కిచెన్లపై మూడువారాల్లోగా ప్రణాళిక రూపొందించి అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదే చివరి అవకాశమని దేశవ్యాప్త ప్రణాళిక అయి ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది.
సామాజిక వేత్తలు అనున్ ధావన్, ఇషాన్ ధావన్, కుంజన సింగ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం ముందుకొచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ సంపూర్ణంగా దాఖలు చేయడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.
కోర్టు ఒకటి చెబితే మరొకటి అఫిడవిట్లో ఉంటోందని పేర్కొంది. ‘‘ఆకలి విషయంలో కేంద్రం శ్రద్ధ చూపుతానంటే రాజ్యాంగం, చట్టాలు అడ్డుచెప్పవు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు అవుతోంది. చివరి అవకాశంగా రెండు వారాల్లో సమావేశం నిర్వహించండి’ అని ధర్మాసనం పేర్కొంది.