అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. మండలంలోని పలుగురాళ్లపల్లె పంచాయతీ జౌకుపల్లె ఎస్సీ కాలనీలో జరిగిన ఈ దారుణ సంఘటన వల్ల ఇద్దరు పిల్లు అనాథలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జౌకుపల్లె ఎస్సీకాలనీకి చెందిన జాలా వసుంధర అక్కడే మినీ అంగన్వాడీలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు కల్సపాడు మండలం చెన్నారెడ్డిపల్లె నుంచి జౌకుపల్లెకు చెందిన ప్రభాకర్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభాకర్ భార్యపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు.
శనివారం తెల్లవారు జామున ఇంటిలో వసుంధర నిద్రిస్తుండగా రోకలిబడెతో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే పడి మృతి చెందింది. ప్రభాకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బి.మఠం ఏఎస్ఐ మూర్తి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మైదుకూరు రూరల్ సీఐ నరేంద్రరెడ్డి, డీఎస్పీ విజయకుమార్ జౌకుపల్లె ఎస్సీకాలనీకి చేరుకొని మృతురాలి బంధువులను,ఇద్దరు పిల్లలను విచారించారు. వసుంధర తల్లి ఫిర్యాదు మేరకు భర్త ప్రభాకర్, మామ, ఇద్దరు మరదులపై బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు.