సంతానం కలగలేదని ఓ కిరాతకుడు భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ఇక్కడి శాస్త్రినగర రెండో క్రాస్‌లో బీజాపుర జిల్లా ఇండి తాలూకా కేరవార గ్రామానికి చెందిన వీరేశ్, భార్య సునంద నివాసం ఉంటున్నారు. ఇతను ఆర్టీసీ డ్రైవర్. 15 ఏళ్లుగా సంతానం కలగలేదని దంపతుల మధ్య గొడవలు జరిగేవి.
శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంపై గొడవపడ్డారు. క్షణికావేశంలో వీరేశ్, భార్య గొంతు నులిమి హత్య చేశాడు. శనివారం ఉదయం సునంద బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కౌల్‌బజార్ సీఐ సుభాష్, మహిళ పోలీస్ స్టేషస్ సీఐ వాసు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.